అమరావతి: ఏపీ సీఎం జగన్ ఈ రోజు కొత్త పథకాలను ప్రవేశ పెట్టారు. నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు.
రాష్ట్రంలోని గర్భిణీల్లో దాదాపు 53 శాతం మందికి రక్తహీనత ఉంది. తక్కువ బరువున్న పిల్లలు సుమారు 32 శాతం మంది ఉంటున్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలు, 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తాం. చదువు, ఆలోచనల్లో బలహీనులుగా ఉండకూడదనే ఈ పథకాలు.
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నాం. 55,607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తాం. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చాం. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా వైఎస్ఆర్ పోషణ, వైఎస్ఆర్ పోషణ ప్లస్ పథకాలు ఉంటాయని’ సీఎం తెలిపారు.
సంపూర్ణ పోషణ పథకం కింద 26.36లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 77 గిరిజన మండలాల్లో 3.80లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం రూ.307.55 కోట్లు కేటాయించామన్నారు. మొత్తంగా సుమారు రూ.1863 కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ చాలా అవసరమని తెలిపారు.