fbpx
HomeTelanganaదారుణంగా నమోదైన జీహెచ్ఎంసీ పోలింగ్ శాతం

దారుణంగా నమోదైన జీహెచ్ఎంసీ పోలింగ్ శాతం

GHMC-RECORDS-POOR-POLLING-PERCENTAGE

హైదరాబాద్‌: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 45.71 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అయితే పూర్తి స్థాయి పోలింగ్‌ వివరాలను బుధవారం ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాలేదని తెలుస్తోంది.

క్రితం 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ నమోదైంది. జీహెచ్‌ఎంసీలోని 149 డివిజన్ల పరిధిలో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ మొదలైనప్పటినుండి మందకొడిగానే సాగింది. కరోనా భయానికి తోడు పార్టీలు, నేతల తీరుపై సరైన అభిప్రాయం లేక చాలామంది ఓటేసేందుకు అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

149 డివిజన్లలో పోటీచేస్తున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది. పోలీసు భద్రత నడుమ బ్యాలెట్‌ పెట్టెలను స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌ (నంబర్‌ 26) లో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలిని బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించాల్సి ఉండగా, పొరపాటున సీపీఎం గుర్తు సుత్తి కొడవలి, నక్షత్రం గుర్తు ముద్రించారు. సీపీఐ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డివిజన్‌లో పోలింగ్‌ను నిలిపేసి 3న రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రీపోలింగ్‌లో ఓటర్ల మధ్య వేలుకు సిరా గుర్తు వేయాలని నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తర్వాతే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆలోగా ప్రభుత్వం చట్ట సవరణలు తీసుకొస్తే మాత్రం ముందే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే అవకాశముంది.

సార్వత్రిక ఎన్నికల తరహాలో పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించడం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అక్కడక్కడ ఘర్షణలకు సైతం దిగడంతో, పోలింగ్‌ రోజు అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్తతలు తలెతొచ్చని చాలామంది ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తోంది. అయితే చెదురు మదురు ఘటనలు తప్ప అంతటా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వ, పోలీస్‌ యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular