fbpx
HomeNationalవిదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ఆలోచనలో ఈసీ

విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ఆలోచనలో ఈసీ

POSTAL-BALLOT-FOR-INDIANS-IN-OTHER-COUNTRIES

న్యూఢిల్లీ: ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఎన్నికలలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వర్తింప జేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) ఆలోచన చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే, ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టం(ఈటీపీబీఎస్‌)ను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లు కూడా వినియోగించుకునే వీలుని కల్పించాలని యోచిస్తోంది.

ఈ ప్రతిపాదనతో ఈసీ నవంబర్‌ 27వ తేదీన భారత న్యాయశాఖకు ఒక లేఖ రాసింది. ఈ విధానాన్ని ఇప్పటికే భారత భద్రతా బలగాలకు విజయవంతంగా అమలు చేస్తున్నందున విదేశాల్లోని భారతీయులకు కూడా అందుబాటు లోకి తేగలమనే నమ్మకం ఉందని అందులో పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌– జూన్‌ నెలల్లో అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు సాంకేతికంగా, పాలనాపరంగా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

విదేశాల్లో ఉండే అర్హులైన భారతీయ ఓటర్లు ఓటు హక్కు వినియో గించుకునేందుకు స్వదేశానికి రావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా రమని, బదులుగా పోస్టల్‌ బ్యాలెట్‌ వెసులు బాటును కల్పించాలంటూ పలు విజ్ఞప్తులు అందాయని వివరించింది. కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ నేపథ్యంలో ఈ సమస్య మరింత సంక్లిష్టమైందని న్యాయశాఖకు తెలిపింది.

ఈటీపీబీఎస్‌ కోసం విదేశాల్లో ఉండే భారతీయులు ముందుగా తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అందించాలి. అప్పుడే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అందుతుంది. ఓటరు ఆ బ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రత్యేక ఎన్వలప్‌లో తన ఓటు నమోదై ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు ఆ బ్యాలెట్‌ చేరుకుంటుంది. లెక్కింపు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతోనే మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular