అమరావతి : ఏపీ లొ మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు, కోర్టు కేసులు, శాసనమండలిలో నాటకీయ పరిణామాల అనంతరం సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం రోజు ఆమోద ముద్ర వేశారు.
మూడు రాజధానులకు ఆది నుంచీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మండలిలో బిల్లును అడ్డుకోవడం, కోర్టుల్లో కేసులు వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా ఎట్టకేలకు గవర్నర్ చేత ఆమోదం లభించింది.
అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం మేరకు ప్రజా ఆమోదం కలిగిన శాసనసభ రెండుసార్లు ఆమోందించిన బిల్లును వెనక్కిపంపడం భావ్యం కాదని భావించిన గవర్నర్ హరిచందన్ ప్రభుత్వ నిర్ణయానికే ఓటు వేశారు. అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మూడు వారాల పాటు బిల్లును పూర్తిగా పరిశీలించిన అనంతరమే మూడు రాజధానులకు రాజముద్ర వేశారు.
శాసనసభ ఆమోందించిన వెంటనే తన నిర్ణయం చెప్పని గవర్నర్ వికేంద్రీకరణ బిల్లుపై పూర్తిగా పరిశీలన చేశారు. బిల్లుకు సంబంధించి పలు అంశాలపై విస్తృత పరిశీలన చేశారు. కోర్టు కేసుల నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు సైతం తీసుకున్నారు.