fbpx
HomeTelanganaటీపీసీసీ చీఫ్‌గా నేడు బాధ్యతల స్వీకరించనున్న రేవంత్

టీపీసీసీ చీఫ్‌గా నేడు బాధ్యతల స్వీకరించనున్న రేవంత్

REVANTH-REDDY-TPCC-CHIEF-TAKES-OATH-TODAY

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొత్తగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకుడు మలికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు అతిథులుగా హాజరవనున్నారు. ఇంకా టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల చైర్మన్లు కూడా పాల్గొంటారని సమాచారం.

రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం నివాసం నుంచి బయలుదేరి మొదట పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి పూజలు చేసిన తర్వాత ర్యాలీగా జూబ్లీ చెక్‌పోస్టు, నాగార్జున సర్కిల్, మాసాబ్‌ట్యాంక్‌ మీదుగా నాంపల్లి చేరుకుంటారు. అక్కడ యూసుఫైన్‌ దర్గాను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత గాంధీభవన్‌కు చేరుకుని, మధ్యాహ్నం 1:30 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు.

కాగా మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు జెట్టి కుసుమకుమార్, మల్లు రవిలతో కలిసి పలువురు టీపీసీసీ నేతల నివాసాలకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిసారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, సీఎల్పీ నేత భట్టి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఇళ్లకు కూడా వెళ్లారు.

జగ్గారెడ్డి నివాసానికి వెళ్లిన సందర్భంగా రేవంత్‌ను శాలువాలతో సన్మానించారు. కాగా, రేవంత్‌కు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఉత్తమ్‌ నేరుగా బెంగళూరులోని జిందాల్‌ ఆశ్రమానికి వెళ్లి అక్కడ 10 రోజుల పాటు ప్రకృతి చికిత్స పొందనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular