హైదరాబాద్ : దేశంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఈ ఉత్తర్వులతో హైదరాబాద్ నగరంలో ఎవరైనా ముఖానికి మాస్క్ ధరించకుండా రోడ్లపై, లేదా వాహనాల్లో తిరిగితే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు నేటి(మంగళవారం) నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహణ మొదలు పెట్టారు. మాస్క్ లేకుండా ఎవరైనా బయట కనిపిస్తే వారికి భారీ జరిమానా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు మాస్క్ లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. జరిమానా ఎంత విధించాలనేది మాత్రం ఇంక నిర్ణయించలేదు. దీని పై ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్తున్న వారిపై హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు 15 వేల వరకు కేసులు నమోదు చేశారని సమాచారం. కాగా మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తించడంలో ట్రాఫిక్ పోలీసులతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషించనున్నాయి.