fbpx
HomeTelanganaరైతులను ఖచ్చితంగా ఆదుకుంటాం: సీఎం కేసీఆర్

రైతులను ఖచ్చితంగా ఆదుకుంటాం: సీఎం కేసీఆర్

KCR-REVIEW-MEETING-FARMERS-CROP

హైదరాబాద్‌ : తెలంగాణలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఈ వానాకాలం మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని సీఎం తెలిపారు.

రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని వరి ధాన్యం 17 శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని సీఎం రైతులను కోరారు.

వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular