హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్)లకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీచేసిన జీవో 402ను తెలంగాణ హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 402ను జారీ చేశారని రాష్ట్రంలోని పలువురు ఉపాధ్యాయులు వేసిన పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి విచారించారు. పరస్పర బదిలీలతో సీనియారిటీ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రప్రభుత్వం సీనియారిటీ కోల్పోకుండా జీవో 402 జారీచేసింది.
అయితే ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం అని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ 20కి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు.