fbpx
HomeAndhra Pradeshఏపీ పోస్టాఫీసుల్లో స్టాంప్‌ పేపర్ల అమ్మకాలు

ఏపీ పోస్టాఫీసుల్లో స్టాంప్‌ పేపర్ల అమ్మకాలు

NONJUDICIAL-STAMP-PAPERS-IN-POSTOFFICES-IN-ANDHRAPRADESH

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్స్‌ పోస్టాఫీసుల్లో కూడా లభించబోతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు సులభంగా స్టాంప్‌ పేపర్స్‌ పొందడానికి వీలుగా పోస్టాఫీసుల్లో కూడా వీటిని అమ్మకానికి అందుబాటులో ఉంచాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే పోస్టల్‌ శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.10, రూ.20, రూ.50, రూ.100 డినామినేషన్ల స్టాంప్‌ పేపర్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,952 మంది లైసెన్సు పొందిన స్టాంప్‌ వెండార్స్‌ ప్రజలకు స్టాంప్ పేపర్స్ ని అమ్ముతున్నారు. కొన్నిసార్లు స్టాంప్‌ పేపర్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని చోట్ల వీటి కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్‌ పెంచి, బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు స్టాంప్‌ వెండార్స్‌ అన్ని జిల్లాల్లో ఒకే సంఖ్యలో లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో స్టాంప్‌ పేపర్స్‌ కొరత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు సులభంగా స్టాంప్‌ పేపర్స్‌ పొందేందుకు పోస్టాఫీసులే సరైన మార్గమని రిజిస్ట్రేషన్ల శాఖ భావించి అందుకనుగుణంగా ఈ చర్యలు చేపట్టింది.

ఏపీలో మండల స్థాయిలో 1,568 పోస్టాఫీసులు పని చేస్తున్నాయి. ప్రతి మండలంలో 2 నుంచి 3 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవికాకుండా గ్రామ స్థాయిలో 10 వేలకుపైగా పోస్టాఫీసులున్నాయి. ప్రస్తుతం మండల స్థాయి పోస్టాఫీసుల్లో స్టాంప్‌ పేపర్స్‌ అమ్మకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో 700 పోస్టాఫీసులకు రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంప్‌ పేపర్స్‌ విక్రయించే లైసెన్సులు మంజూరు చేసింది. రెండో దశలో మిగిలిన 868 పోస్టాఫీసులకు లైసెన్సులు ఇస్తారు.

తరువాత నిదానంగా మూడో దశలో గ్రామస్థాయి పోస్టాఫీసుల్లో కూడా విక్రయానికి పెట్టనున్నారు. రూ.15 కోట్ల విలువైన స్టాంప్‌ పేపర్స్‌ ఒకటి, రెండు దశల్లో పోస్టాఫీసుల ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్స్‌ను మరింత సులభంగా ప్రజలు తీసుకునేందుకు వీలుగా పోస్టాఫీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మొదట మండల స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు ప్రారంభిస్తాం. ఆ తర్వాత వీలును బట్టి గ్రామ స్థాయి పోస్టాఫీసుల్లో అమ్మకాలు జరిపే అంశాన్ని పరిశీలిస్తాం అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular