పట్నా: ఇటివల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో చేరతారంటూ వార్తలు వచ్చాయి. సమాజసేవ చేయడం కోసమే పదవి విరమణ చేశానంటూ ఈ వార్తలని ఖండించారు.
అయితే నిన్నటి వరకు తాను రాజకీయాల్లో చేరనని చెప్పిన ఈ పోలీస్ బాస్ గుప్తేశ్వర్ పాండే రాత్రికి రాత్రే తన మనసు మార్చుకున్నారు. ఇవాళ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పష్టత ఇచ్చారు. తను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తేల్చిచెప్పారు పాండే. క్రిమినల్స్ పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నారు, అలాంటప్పుడు తానేందుకు రాజకీయాల్లో రాకూడదు అని ప్రశ్నించారు పాండే.
నేను రాజకీయాల్లోకి రావడం ఏమైనా అనైతిక చర్యనా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో తాను ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తాను అని పాండే ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచి తీరతానని చెప్పారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తే సింహాంలా అడుగుపెడుతానని, దొంగలా కాదని గుప్తేశ్వర్ పాండే పేర్కొన్నారు.