fbpx
HomeInternationalబ్రహ్మపుత్ర పై చైనా భారీ ప్రాజెక్టు!

బ్రహ్మపుత్ర పై చైనా భారీ ప్రాజెక్టు!

CHINA-HYDROPOWER-PROJECT-ON-BRAHMAPUTRA

బీజింగ్‌: బ్రహ్మపుత్ర హిమాలయ నదుల్లో అత్యంత ప్రత్యేకమైనదిగా గుర్తింపు ఉన్న నది. ఈ నదిపై చైనా భారీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమైంది. 14వ పంచవర్ష ప్రణాళిక(2021-25) అమలులో భాగంగా టిబెట్‌లో ఈ మేరకు నిర్మాణం చేపట్టనున్నట్లు డ్రాగన్‌ దేశ అధికార మీడియా ప్రకటించింది.

చైనా సొసైటీ ఫర్‌ హైడ్రోపవర్‌ ఇంజనీరింగ్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా విద్యుదుత్పత్తి కార్పొరేషన్‌ చైర్మన్‌ యాన్‌ జియాంగ్‌ మాట్లాడుతూ, చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలా జరుగలేదు. చైనీస్‌ జలవిద్యుత్‌ పరిశ్రమలో ఇదొక నూతన అధ్యాయం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని టిబెట్‌లో యార్లాంగ్‌ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నిర్మించనుంది అని వ్యాఖ్యానించారు.

అలాగే టిబెట్‌- అరుణాచల్‌ సరిహద్దులోని మెడాగ్‌ సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, జాతీయ భద్రత, నదీ జలాలు, అంతర్గత భద్రత తదితర అంశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా పేర్కొంది. ఈ విషయంలో ఇతర దేశాలు ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది.

ఈ నూతన ప్రాజెక్టుకు అవసరమైన ప్రతిపాదనలను జాతీయ అసెంబ్లీ వచ్చే ఏడాది ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే జాతీయ ఆర్థిక, సామాజికాభివృద్ధి ప్రణాళికలో భాగంగా 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యాల గురించి తీర్మానం చేస్తూ చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ గత నెలలో నిర్ణయం తీసుకుంది.

ఇక ఇటు భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ ఈశాన్య రాష్ట్రాల వరప్రదాయిని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మాణాల నేపథ్యంలో ఆందోళనలు కలుగుతున్నాయి. వాస్తవానికి టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ, జిన్షా, లాన్‌శాంగ్‌, నుజియాంగ్‌ నదులు ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్‌కు బ్రహ్మపుత్రతో పాటు ఇవి కూడా అనుకూలమైనవనని నిపుణులు ఇప్పటికే తేల్చినట్లు కథనాలు వెలువడ్డాయి.

కానీ చైనా వాటన్నింటినీ కాదని, భారత్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపైనే చైనా దృష్టి పెట్టడం గమనార్హం. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చల్లారేలా చర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం వక్రబుద్ధితోనే బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్‌ దేశం ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular