చెన్నై: కొద్ది రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో తమిళనాడు కూడా ఉంది. కాగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిన్నమ్మ శశికళ ఎవరూ ఊహించని ఒక సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ అశ్చర్యపరిచారు.
ఆమె ఇకపై ప్రత్యక్ష రాజకీయాలలో ఉండనని, రాజకీయాలకు వీడ్కోలు పలికారు. ఆమె తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీని ఓడించాలని అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ పిలుపునిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు పాలన తమిళనాడులో కొనసాగాలని ఆమె పేర్కొన్నారు.
శశికళ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాట్లు ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకానొక సమయంలో మూడో కూటమి తలుపులు మూసుకుపోవడంతో ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) నేతృత్వంలో నాలుగో కూటమికి చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు.
ఆమె ఇటీవలనే జైలు నుంచి విడుదలైన శశికళ చేసిన ఈ సంచలన ప్రకటనపై కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఇటీవలే నటుడు శరత్‌కుమార్ వచ్చి చిన్నమ్మను కలిసి తమిళనాడు రాజకీయాలపై విస్తృత చర్చలు కూడా జరిపి వెళ్ళారు, ఇంతలో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది.