fbpx
Saturday, July 27, 2024
HomeBusinessటీసీఎస్ ప్రపంచ విలువైన కంపెనీల్లో ఒకటి

టీసీఎస్ ప్రపంచ విలువైన కంపెనీల్లో ఒకటి

TCS-MOST-VALUABLE-COMPANY-IN-WORLD

న్యూఢిల్లీ: భారత ఐటీ సర్వీసెస్ దిగ్గజం అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్‌) మరో అరుదైన కీర్తి లభించింది. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్స్‌లో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌–2021 తన నివేదికలో తెలిపింది.

ఇంఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా టాప్‌–10లో భారత్‌ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో కంపెనీలు ఈ సారి చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్‌ డాలర్లు ఎగసి 14.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. తమ కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌.రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రపంచంలొ ఉన్న అన్ని ఐటీ కంపెనీల మొత్తం బ్రాండ్‌ విలువ 3 శాతం తగ్గగా, ఒక్క టీసీఎస్ మాత్రం‌ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్‌ డాలర్ల డీల్స్‌ను చేజిక్కించుకోవడంతో బలమైన ఆదాయాన్ని నమోదు చేసింది. ఐటీ రంగంలో టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సైతం గరిష్ట స్థాయిని తాకింది. బ్రాండ్‌ విలువ పరంగా ప్రపంచంలో ఈ రంగంలో రెండవ స్థానానికి చేరువలో టీసీఎస్‌ ఉందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ సీఈవో డేవిడ్‌ హైగ్‌ తెలిపారు.

కోవిడ్ పరిస్థితుల తరువాత రికవరీ మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు యూఎస్, యూరప్‌లో ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో పెట్టుబడులు పెరగడం కారణంగా రాబోయే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని నివేదిక వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 4,69,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular