ముంబై : కరోనా వైరస్ వల్ల ఈ మధ్య శనిటైజర్ వినియోగం ఎక్కువైంది. ఎక్కడ చూసిన, ఎవరి చేతిలో చూసిన శానిటైజర్ కనిపించడం సర్వ సాధారణం అయింది. ఇటీవల తెలంగాణలో పోలియో చుక్కల బదులు శానిటైజర్ వేయడంతో చిన్న పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇది మరవక ముందే ఇలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది.
ముంబైలోని బీఎంసీ ఆఫీస్ లో నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున శానిటైజర్ బాటిల్ తీసుకుని దాన్ని తాగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వీక్షకులకు నవ్వులు తెప్పించింది. కొద్దిగా శానిటైజర్ తాగిన అనంతరం వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమవడంతో ఆయన శానిటైజర్‌ను ఉమ్మేసి తరువాట మంచి నీళ్లు తాగారు. శానిటైజర్ తాగినట్లు గుర్తించిన ఆ అధికారి నవ్వడంతో తోటి అధికారులు కూడా నవ్వుకున్నారు. ఈ ఘటన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో జరిగింది.
2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్‌ను బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్ పవార్ సమర్పిస్తున్నారు. నివేదిక ఇచ్చిన అనంతరం అందరూ కూర్చున్న సమయంలో ఆయన మంచి నీళ్లు తాగడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నీళ్ల బాటిల్ అనుకుని శానిటైజర్ డబ్బాను తీసుకొని తాగారు.
కమీషనర్ వెంట నిల్చున సహాయక సిబ్బంది వెంటనే దాన్ని గమనించి ఆయనను వారించారు. కాగా ఆయన అప్పటికే కాస్త శానిటైజర్ను తాగారు. వెంటనే దాన్ని ఉమ్మి వేసి ఒక్క సారిగా నవ్వారు. అక్కడి సిబ్బంది ఆయనకు నీళ్ల సీసా అందించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.