ముంబై: భారత్ లో ఎన్నో కంపెనీలు ఉన్నా టాటా గ్రూపు అంటే మాత్రం విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి ఆవగింజ అంత కూడా గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల టాటా సంస్థలు చూపే శ్రద్ధ గురించి అందులో పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయనకు దేశం పట్ల, సమాజం పట్ల ఎంతో ప్రేమ, బాధ్యత ఉందనేది పలు సందర్భాల్లో తెలిసిందే. ఇక ఏదైనా విపత్తు వచ్చిందంటే చాలు సాయం చేయడంలో టాటా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత నాలుగైదు రోజులుగా రతన్ టాటాకు సంబధించిన ఓ వార్త సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. తమ కంపెనీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు.
ఈ ఘటనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో రతన్ టాటా సదరు ఉద్యోగి పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేశారు.
రతన్ టాటా లివింగ్ లెజెండ్, భారతదేశంలో ఉన్న అతి గొప్ప వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తమ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్నారని రతన్ టాటాకు తెలిసింది.
అది తెలుసుకున్న రతన్ టాటా అతడిని పరామర్శించడానికి ముంబై నుంచి పుణె వెళ్లారు. ఆయన వెంట ఏ బౌన్సర్లు లేరు, మీడియా హడావుడి లేదు. నమ్మకంగా పని చేసిన ఉద్యోగి పట్ల ఆయన చూపిన ఈ సానుభూతి ఎంతో గొప్పది. డబ్బు మాత్రమే జీవితం కాదని అందరు వ్యాపారవేత్తలు తెలుసుకోవాలి. గొప్ప మనిషిగా బతకడం అనేది ముఖ్యం. సర్ మీరు చేసిన ఈ పనికి గౌరవంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.