fbpx
HomeNationalనితీశ్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధం

నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధం

NITISH-CM-OF-BIHAR-AGAIN

పట్నా: మొన్న జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించక పోయినప్పటికీ బీజేపీ అండతో మరో సారి బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్‌కే అప్పగించింది.

పట్నాలో ఈ ఆదివారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్‌ కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు.

క్రితం అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్‌ పార్టీ జనతాదళ్‌ యునైటెడ్‌ బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్‌ క్లీన్‌ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించాయి. ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్‌ కుమార్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ను కలుసుకున్నారు.

తనను కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ ని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం నితీశ్‌ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్‌కి సమర్పించాను. గవర్నర్‌ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular