నల్లగొండ : తెలంగాణ గ్రామాలలోని సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం ఈ నెల నుంచి నేరుగా వారి ఖాతాల్లోకే జమ అవనుంది. వారికి ఇప్పటివరకు గౌరవ వేతనం గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేయడం, తదుపరి వాటిని డ్రా చేసే సందర్భంలో కొన్ని పంచాయతీల్లో ఇబ్బందులు తలెత్తుతుండడంతో సర్పంచ్‌లంతా నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేయాలని చేసిన విజ్ఞప్తులను తెలంగాణ ప్రభుత్వం ఆమోద నిర్ణయం తీసుకుంది.
వారికి గడచిన జనవరి నెల నుంచి వేతన బకాయిలు ఉన్నాయి. ఒకేసారి మార్చి వరకు మూడు మాసాల వేతనాన్ని విడుదల చేస్తూ వాటిని నేరుగా సర్పంచ్‌ల వ్యక్తిగత ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారి ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
నల్లగొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 7 గ్రామపంచాయతీలు నకిరేకల్ మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ ప్రస్తుతం సర్పంచ్‌లు లేరు. ఐదుగురు సర్పంచ్‌లు సస్పెన్షన్‌కు గురికాగా అక్కడ ఉన్న ఉప సర్పంచ్‌లకు ఆ సర్పంచ్ బాధ్యతలను కట్టబెట్టారు.
ఇద్దరు సర్పంచ్‌లు జెడ్పీటీసీలుగా ఎన్నిక కావడంతో అక్కడ కూడా ఉప సర్పంచ్‌లు బాధ్యతుల నిర్వహిస్తున్నారు. ఈ ఏడుగురికి కూడా గౌరవ వేతనం పొందే అవకాశం కల్పించారు. నూతన పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కూడా ప్రభుత్వం చెక్ పవర్ కల్పించింది.
ఇక నుంచి నేరుగానే సర్పంచ్‌ల గౌరవవేతనాన్ని వారి సొంత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత జనవరి మాసం వేతన బకాయితోపాటు నడుస్తున్న ఫిబ్రవరి, మార్చితో కలిపి 3 నెలల గౌరవవేతనాన్ని ఒకేసారి 1,25,55,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి డీపీఓ అకౌంట్లలో జమ చేసింది. రెండు మూడు రోజుల్లో ఆయా సర్పంచ్‌ల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ కాబోతున్నాయి.
సర్పంచ్‌లకు జనవరి నుంచి వచ్చే మార్చి మాసం వరకు మూడు మాసాల గౌరవ వేతనాన్ని 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. గతంలో పంచాయతీ ఖాతాల్లో జమ చేసేవాళ్లం. ప్రస్తుతం నేరుగా సర్పంచ్‌ల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశాలు అందాయి. రెండు మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.