విజయవాడ: కోవిషీల్డ్ టీకా డోసులు ఏపీకు భారీగా చేరాయి. రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయానికి ఇవాళ 9 లక్షల డోసులు వచ్చాయి. వాటిని గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించి భద్రపరచారు. ఏపీలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరింత మెళకువతో వ్యవహరిస్తోంది.
కాగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ అలసత్వం వహించొద్దని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. కోవిడ్ జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని అన్నారు. కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్‌పై సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో మే 5వ తేదీ నుంచి విధించిన కర్ఫ్యూ మరియు అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా క్రమంగా తగ్గుతోంది, అందువల్ల జూన్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. మే 15న 25.56 శాతానికి పైగా పాజిటివిటీ ఉంటే, ప్రస్తుతం అది 5.97 శాతంగా ఉంది.