fbpx
HomeInternationalయూకేలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్

యూకేలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్

COVID-CASES-RAISE-IN-UK-AGAIN

లండన్‌: యూనైటెడ్ కింగ్డం లో కరోనా మహమ్మారి వ్యాప్తి తిరిగి తీవ్రమవుతోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌తో ఇప్పుడు కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో రోజుకి 6 వేల కేసులు పైగా నమోదు అవుతున్నాయి. ఆస్పత్రి పాలయ్యే కోవిడ్‌–19 రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. జూలై, ఆగస్టులలో కేసులు బాగా నియంత్రణలోకి వచ్చినప్పటికీ సెప్టెంబర్‌లో కరోనా మళ్లీ భయపెడుతోంది.

గత వారంలో రోజుకి 3,200 కేసులు నమోదైతే, ఇప్పుడు వాటి సంఖ్య 6 వేలకి చేరుకున్నట్టుగా ఆఫీసు ఫర్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌ (ఒఎన్‌ఎస్‌) గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు యూకేలో దాదాపుగా 4 లక్షల కేసులు నమోదైతే, 42 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీ ఎనిమిది రోజులకి ఆస్పత్రిలో చేరే కోవిడ్‌ రోగుల సంఖ్య రెట్టింపు అవుతూ ఉండడంతో తప్పనిసరైతే మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మట్‌ హన్‌కాక్‌ చెప్పారు.

పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు లోతుగా సమీక్షిస్తున్నామని, వచ్చేవారంలో దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ పూర్తి స్థాయిలో కాకున్నా రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులపై ఆంక్షలు విధిస్తామని అన్నారు. శీతాకాలం వస్తూ ఉండడం ఫ్లూ వంటి సీజనల్‌ జ్వరాలు కూడా ఉధృతమయ్యే వేళ కరోనా కూడా తీవ్రమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్లకి చేరుకుంది. వీటిలో సగం కేసులు అమెరికా, బ్రెజిల్, భారత్‌ నుంచే వచ్చాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. ఆగస్టు 12న రెండు కోట్లు ఉన్న కేసులు నెల రోజుల్లోనే మూడు కోట్లకి చేరుకున్నాయి. యూరప్‌ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది ఇలా ఉండగా, ఇప్పుడు చైనాలో కొత్త బ్యాక్టీరియా వ్యాధి ఒకటి వెలుగు చూసింది. జంతువుల ద్వారా బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా లాంజౌ నగరంలోని 3,245 మందికి సోకినట్లు చైనా తెలిపింది. మరో 1,401 మందికి బ్యాక్టీరియా ప్రాథమిక దశలో ఉందని వెల్లడించింది. ప్రభుత్వ బయో ఫార్మా సూటికల్‌ ప్లాంట్‌ నుంచి గాలి ద్వారా బ్యాక్టీరియా సోకినట్లు తెలుస్తోంది. దీని కారణంగా జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొంది. ప్లాంట్‌లో నిర్వహణ సరిగా లేకనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular