fbpx
Tuesday, April 30, 2024
HomeInternationalఅమెరికాలో అగ్నిప్రమాదం, తెలుగు విద్యార్థులు క్షేమం

అమెరికాలో అగ్నిప్రమాదం, తెలుగు విద్యార్థులు క్షేమం

TELUGU-STUDENTS-ESCAPE-FIRE-ACCIDENT

అమరావతి: అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్‌బర్గ్‌లో తెలుగు విద్యార్థులు నివాసముంటున్న అపార్టుమెంట్‌లో రెండు రోజుల క్రితం ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిపోయాయి. జార్జియా స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు 28 మంది వీటిలో నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉన్నారు.

అయితే వారికి సంబందించిన దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాయి. అట్లాంటాలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త డాక్టర్‌ అన్నవరపు కుమార్‌ ప్రభుత్వానికి అగ్నిప్రమాదానికి సంబందించిన సమాచారం అందించారు.

ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులను ఆదుకొనేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్వర ఆదేశాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్‌చంద్ర, బాధిత విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విదేశీవిద్య సమస్వయ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలతో స్థానిక తెలుగు అసోసియేషన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టామని డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు తెలిపారు. విద్యార్థులు కోల్పోయిన ధ్రువపత్రాలను వీలైనంత త్వరగా ఇప్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన ఇతర సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ హరికృష్ణ, విదేశీ విద్య సమన్వయకర్తలు విద్యార్థులను ఆదుకొనే చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular