మూవీడెస్క్: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించిన నక్సలిజం నేపథ్యంతో సాగే ఒక ప్రేమ కథా చిత్రం కావడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై అమితమైన ఆసక్తి పెరిగింది.
కాగా ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్ చిత్రంపై భారీగా ఆసక్తిని పెంచాయి. శుక్రవారం(జూన్ 17)న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారంటే: 3/5
విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలోనిది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్).
ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి ఆయనతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు.
ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది.
కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే.
దర్శకుడి ఊహకు పదిరెట్లు ఎక్కువగానే సాయి పల్లవి నటించిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూనే యాక్షన్ సీన్స్‌లో విజిల్స్ వేయించింది. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది.
ఇక కామ్రేడ్ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ, వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్ చంద్ర తమదైన నటనతో ఆకట్టుకున్నారు.
చిత్రం సాంకేతిక పరంగా చూస్తే ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా కథతో పాటుగా సాగుతాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.