చిత్తూరు: చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి మండలంలోని మర్రిమాకులపల్లె పంచాయతీలో ఎన్నో ఏళ్ళ నుండి నేటి వరకూ కేతిరెడ్డి కుటుంబం హవా నడుస్తూనే ఉంది. మర్రిమాకులపల్లే పంచాయతీ ఏర్పడినప్పుడు మొదటి సర్పంచ్‌గా కేతిరెడ్డి తిమ్మారెడ్డి ఎన్నికయ్యారు.
ఇక అప్పటి నుంచి వరుసగా ఆయన మూడుసార్లు పదవిలో కొనసాగారు. అనంతరం ఆయన కుమారుడు కె.వెంకటరమణారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై ఆయన మూడుసార్లు సర్పంచ్‌గా పని చేశారు. వెంకటరమణారెడ్డి కోడలు కె.జ్యోతి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు.
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా రెండోసారి గ్రామస్తుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక అవడం విశేషం. ఈ పంచాయతీలో సుమారు 618 మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. కేతిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యలపై స్పందించడం, పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడమే ఇందుకు కారణం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేయడంతో ఆ కుటుంబంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు.