అమరావతి: మన రాష్ట్రం లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిస్నప్పటి నుండి ఏపీలో యుద్ధ వాతావరణం నెలకొంది. స్టీల్‌ప్లాంట్ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి విజ్ఞప్తి లేఖ రాశారు.
ఏపీ వైజాగ్ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం తాము తీసుకున్న ఈ నిర్ణయం మార్చుకోవాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం జగన్, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం చేసిన ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను మా వెంట తీసుకొస్తాం.
ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా కలిసి మీకు వివరిస్తాం, అని సీఎం వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.