హైదరాబాద్: కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల తనకి దొరికిన ఈ సమయాన్ని చాలా చక్కగా వాడుకుంటుంది సమంత. తనకి తెలియని విషయాలు తెలుసుకుంటూ, తెలియ చెప్పుతూ తన ద్వారా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్. ఈ మధ్యనే తాను ఇంట్లో పెంచిన వెజిటబుల్ గార్డన్ ను పరిచయం చేసిన సమంత ‘మనకు కావాల్సిన ఆహారాన్ని మనమే ఎలా పండించుకోవాలి అనే ఆలోచనతో నేను స్వయంగా అర్బన్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నానని’ చెప్పుకొచ్చింది. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పండించిన కూరగాయల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ ఇస్తూ వచ్చింది. అర్బన్ ఫార్మింగ్ విధానాన్ని అందరికి తెలియజేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
తాను చేసిన ‘టెర్రస్ గార్డెనింగ్’ అందరికీ వీలు పడదని ‘జీరో బడ్జెట్ గార్డెనింగ్’ గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది సమంత. ఈ క్రమంలో కొంతమందిని ఇంటర్వ్యూ చేసి అర్బన్ ఫార్మింగ్ గురించి వెల్లడించనుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ‘జీరో బడ్జెట్ గార్డెనింగ్ – ఎలా ఎందుకు?’ అనే పేరుతో భార్గవి అనే అర్బన్ ఫార్మర్ ని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో అర్బన్ ఫార్మింగ్ చేయడానికి ఆమెను ప్రేరేపించిన అంశాలు, మొదట్లో ఆమె ఎదుర్కున్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలను తన ఇంటర్వ్యూ ద్వారా సమంత తెలియజేసింది. ఇలా సేంద్రియ వ్యవసాయం గురించి, అర్బన్ ఫార్మింగ్ గురించి చాలా మందికి తెలియచేస్తూ సమంత ఒక మంచి ప్రయత్నం తో ముందుకు వెళ్తుంది.