న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరాటంకంగా పెరిగి పోతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై వినియోగదారులకు త్వరలోనే ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం చర్యలు ఈ తాజా అంచనాలపై ఆశలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా పెట్రోలు ధరలు రికార్డు స్థాయిలను తాకడంతో వాహనాలను తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ సందర్భంగా అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే పెట్రో ధరలపై బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునుందనే అంచనాలు భారీగా వ్యాపించాయి. ఈ మేరకు చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం మోపుతున్న ఎక్సైజ్ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది.
అలాగే ఊగిసలాట లేకుండా ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది. ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది.