fbpx
Wednesday, October 23, 2024
HomeAndhra Pradeshజంతువులను దిగుమతి చేసుకోవాలి: డిప్యూటి సీఎం!

జంతువులను దిగుమతి చేసుకోవాలి: డిప్యూటి సీఎం!

IMPORT-ANIMALS-FOR-ZOO-DEPUTY-CM

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో కొత్త జూ పార్కుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

మంగళగిరిలోని పవన్ కల్యాణ్ నివాసంలో జరిగిన జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశంలో రాష్ట్ర జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కల్యాణ్ కు అధికారులు తెలియజేశారు.

గౌరవ ఛైర్మన్ హోదాలో పవన్ కల్యాణ్, జూ పార్కులు మరియు పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యాటకులను ఆకట్టుకునే పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పర్యాటకులకు వన్యప్రాణుల సందర్శన ద్వారా ప్రత్యేక అనుభూతులు కలిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కార్పోరేట్లను జూ పార్కుల అభివృద్ధిలో భాగస్వాములుగా చేసుకోవాలని, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలను రూపొందించాలని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖపట్నం పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే పారిశ్రామికవేత్తలు మరియు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా ‘తేనీటి సేవనం’ (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular