న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ సారధి శ్రేయస్ అయ్యర్ గాయపడి ఐపీఎల్ 2021 కి దూరమయ్యాడు. కాగా ఈ నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా టీమిండియా డైనమైట్ ఆటగాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ మరియు వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమించబడ్డాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వారి పూర్వ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జట్టు ఢిల్లీ యాజమాన్యం తెలిపింది. సీనియర్ ఆటగాళ్లు రహానే, అశ్విన్, ధవన్ రేసులో ఉన్నప్పటికీ పంత్‌వైపే జట్టు యాజమాన్యం మొగ్గుచూపింది.
ఢిల్లీ జట్టులో కొత్తగా చేరిన ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడని, కానీ పంత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని యాజమాన్యం నిర్ణయించిందని ఆ జట్టు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ప్రారంభంకానున్న లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
కాగా గత ఏడాది సిజన్ రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈ సారి తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొంటుంది. ఏప్రిల్ 10న ముంబై వేదిక జరిగే ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి.