హైదరాబాద్/అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్లు దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలకు చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌కు కూడా కొవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమీంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్ కూడా పూర్తి చేసింది.
వ్యాక్సిన్ పంపిణీలో జరిగే వృధాను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన లబ్ధిదారుల నిష్పత్తి (1.19 లక్షల)కి అదనంగా పది శాతం (1.30 లక్షలు)డోసుల వ్యాక్సిన్‌ను కేటాయించింది. ఇప్పటికే వ్యాక్సిన్ న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్‌కు చేరుకుంది. కోవిషీల్డ్ తరలించడానికి ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలోని రాష్ట్ర శీతలీకరణ కేంద్రంలో వ్యాక్సిన్ భద్రపరిచి, రేపు అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు తరలిస్తారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేలా వ్యాక్సిన్ డెలివరీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు.
గన్నవరం రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద కూలర్లు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ భద్రపరచడానికి గన్నవరం కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. గన్నవరం స్టోరేజ్ కేంద్రం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టోరేజ్ కేంద్రం వద్ద 8 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది. ఈనెల 16న వ్యాక్సినేషన్‌కు వైద్య అధికారుల ఏర్పాట్లు చేశారు.