fbpx
Thursday, April 25, 2024
HomeMovie Newsసమీక్ష: భానుమతి & రామ క్రిష్ణ

సమీక్ష: భానుమతి & రామ క్రిష్ణ

Bhanumathi and Ramakrishna Review

ఓటీటీ లో విడుదల అయిన మరొక తెలుగు సినిమా భానుమతి రామక్రిష్ణ. నవీన్ చంద్ర, కొత్తమ్మాయి సలోని లుథ్రా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించాడు. చివరి నిమిషంలో భానుమతి & రామక్రిష్ణ గా పేరు మార్చిన ఈ సినిమా ప్రత్యేకతలు చూద్దాం.

కథ:
భానుమతి, తన నానమ్మ పేరు అని పరిచయం చేసే ఈ క్యారెక్టర్ ఆధునిక భావాలున్న అమ్మాయి. ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ లో పెద్ద పొసిషన్ లో ఉంటుంది. భానుమతి ఎక్కువగా ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయి, ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువ. తాను పని చేస్తున్న ఆఫీస్ లోనే తన తోనే పని చేయడానికి వస్తాడు రామక్రిష్ణ. పూర్తిగా భిన్న స్వభావాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న వీళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు అనేదే కథ.

నటీనటులు:
రామక్రిష్ణ పాత్రలో నటించిన నవీన్ చంద్ర తన ప్రత్యేకత మళ్ళీ చాటుకున్నాడు. పాత్రలో ఉండే అమాయకత్వం, పక్కింటి కుర్రాడి లుక్స్ లాంటివి కలిపి ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకి ఎక్కడ కూడా నవీన్ చంద్ర కనపడడు. 33 ఏళ్ల రామక్రిష్ణ నే మనకి కనిపిస్తారు. భానుమతి పాత్రలో చేసిన కొత్త అమ్మాయి ‘సలోని లూథ్రా’ తన పాత్రకి తగ్గట్టు చాలా అద్భుతం గా నటించింది. ఈ సినిమా ఎక్కువగా ఈ అమ్మాయి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాంటి పాత్రని చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. ఈ సినిమాలో ఈ అమ్మాయిని చూస్తే కారెక్టరుకి సరిగ్గా సూట్ అయినట్టు అనిపిస్తుంది. వైవా హర్ష, హీరోయిన్ లవర్ గా నటించిన రాజా ఉన్నంత వారికి బాగానే చేసారు.

సాంకేతిక వర్గం:
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
దర్శకత్వం: శ్రీకాంత్ నగోతి

ఈ సినిమాకి సంగీతం అందించిన శ్రవణ్ భరద్వాజ్ సినిమాకి తగ్గట్టు నేపధ్య సంగీతం ఇచ్చారు. ఉన్నవి రెండు పాటలే అయినా అవి స్టోరీ తో పాటు ట్రావెల్ ఐతూ ఉంటాయి. సంగీతం ఎక్కడా ఎబ్బెట్టు గా అనిపించదు. శ్రీకాంత్ రచన, సంభాషణలు మరీ అద్భుతం అని చెప్పకపోయినా బాగానే ఆకట్టుకున్నాయి. కొన్ని చోట్ల సంభాషణలు కట్టిపడేస్తాయి. సాయిప్రకాష్ ఛాయాగ్రహణం కూడా బాగానే ఉంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎడిటింగ్. రవికాంత్ పేరెపు (క్షణం, క్రిష్ణ అండ్ హిస్ లీల డైరెక్టర్) ఎడిటింగ్ క్రిస్పీ గా ఉంది.తాను డైరెక్ట్ చేసిన ‘క్రిష్ణ అండ్ హిస్ లీల’ సినిమా కూడా ఒకేసారి రిలీజ్ ఉన్నప్పటికీ రవికాంత్ ఈ సినిమా ఎడిటింగ్ అద్భుతం గా చేసి తన ప్రత్యేకత సినిమా పైన తనకి ఉన్న డెడికేషన్ చాటుకున్నారు. ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ కొత్తగా ప్రయత్నించింది ఏమి లేదు కానీ ఉన్నంత వరకు సినిమా చూసేవాళ్ళని సీట్లకి కట్టి పడేసేలా చేసాడు.

విశ్లేషణ:
లవ్ , బ్రేకప్, ఇగో, లవ్ ఇలాంటి సీక్వెన్స్ ఉన్న కథలు ఇదివరకే చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా అదే ఫ్లో లో ఉంటుంది. ఈ సినిమా హీరోయిన్ పరిచయం నుండి ప్రారంభిస్తారు. టైటిల్స్ రోలింగ్ లోనే తన లవర్ తో జరిగే సంభాషణలతో హీరోయిన్ క్యారెక్టర్ పరిచయం చేస్తాడు. సినిమా ఎడిటింగ్ ఎంత క్రిస్పీ గా ఉంటుందో ఈ సీన్ తోనే అర్ధం అవుతుంది. అలాగే తన బ్రేకప్ సీన్స్ కూడా చాల షార్ట్ గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు పెద్దగా డ్రామా లేకుండా ముగించేశాడు డైరెక్టర్. ఇక్కడే డైరెక్టర్ పనితనం తెలుస్తుంది. ఇంకా నవీన్ చంద్ర పాత్ర పరిచయం, అతని వ్యక్తిత్వం అతి కొన్ని చిన్న స్పీన్స్ తో చెప్పగలిగాడు డైరెక్టర్. తెలిసిన కథే అయినా ఎక్కడ బోర్ లేకుండా, చూసేది ఓటీటీ లో అయినా కూడా ఫార్వర్డ్ బటన్ వెతికే పని లేకుండా చేయగలిగేలా చేసాడంటే డైరెక్టర్ గొప్పతనం తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రెసెంటేషన్ ఎక్కువగా శేఖర్ కమ్ముల సినిమా హీరోయిన్ లాగ ఉంటాయి. కథనం కూడా అదే ఫ్లో లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా హీరో హీరోయిన్ మధ్య స్నేహం, ప్రేమ డెవలప్ అయ్యే సీన్స్ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. కానీ సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి ఎదో హడావిడిగా ముగించేసినట్టు అనిపిస్తుంది. వైవా హర్ష కామెడీ ఎదో ఎబ్బెట్టుగా , సినిమాలో ఇరికించినట్టుగా అనిపిస్తుంది. తన పాత్ర ప్రత్యేకత ఏమి ఉండదు. ఎడిటింగ్ లో కట్ అయిందో ఏమో తెలియదు లేదా కొత్తగా ఆక్ట్ చెయ్యడానికి ట్రై చేశాడా లేదా ఓటీటీ అని ఆలా ఆక్ట్ చేసాడో ఏమో తెలియదు కానీ అతని కామెడీ ఎదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే భానుమతి & రామ క్రిష్ణ రొటీన్ కానీ కట్టిపడేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular