అమరావతి: ఏపీలో సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను తీర్చే విధంగా ఇంటివద్దే వాటిని అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ రోజు ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా చేసే వాహనాలను గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదే రోజు మంత్రులు ప్రారంభిస్తారు.
ఇక రాష్ట్రం మొత్తం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దకు చేరవేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ ఈ పథకాన్ని రూపొందించారు. వాహనాల ఆపరేటర్లతో పాటు నోడల్ వీఆర్‌వోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.