fbpx
HomeBusinessగూగుల్ కు పోటీగా పేటీయం నుండి మినీ యాప్ స్టోర్

గూగుల్ కు పోటీగా పేటీయం నుండి మినీ యాప్ స్టోర్

PAYTM-MINI-APP-STORE-RIVAL-GOOGLE

న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో తమ నిబంధనల ఉల్లంఘన పేరుతో పేటియం యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన టెక్‌ దిగ్గజం గూగుల్‌తో తలపడేందుకు దేశీ ఈ–కామర్స్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్‌ మినీ యాప్‌ స్టోర్‌ను ప్రవేశ పెట్టింది.

తమ యాప్‌లోనే అంతర్గతంగా మినీ–యాప్స్‌ను లిస్టింగ్‌ చేసుకోవడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలియజేసింది. అలాగే, యూజర్లు పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్, యూపీఐ, నెట్‌–బ్యాంకింగ్, కార్డులు మొదలైన వాటి ద్వారా చెల్లింపులు జరిపే విధంగా డెవలపర్లు తమ ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వొచ్చని పేర్కొంది. క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులపై మాత్రమే 2 శాతం చార్జీ ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం ఈ యాప్‌ స్టోర్‌ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు చెప్పింది. డెకాథ్లాన్, ఓలా, పార్క్‌ప్లస్, ర్యాపిడో, నెట్‌మెడ్స్, 1ఎంజీ, డోమినోస్‌ పిజ్జా, ఫ్రెష్‌మెనూ, నోబ్రోకర్‌ వంటి 300 కు పైగా యాప్‌ ఆధారిత సర్వీసుల సంస్థలు ఇప్పటికే ఇందులో చేరినట్లు పేటీఎం తెలిపింది. ‘

భారతీయ యాప్‌ డెవలపర్‌కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్‌ స్టోర్‌ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం‘ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. పేటీఎం యూజర్లు ప్రత్యేకంగా ఆయా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, తమకు నచ్చిన పేమెంట్‌ ఆప్షన్ల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. పరిమిత స్థాయిలో డేటా, ఫోన్‌ మెమరీ గల యూజర్లకు ఇలాంటి మినీ యాప్స్‌ ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.

టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల విభాగంలో గూగుల్‌తో పేటీఎం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో నిబంధనలకు విరుద్ధంగా క్రీడల బెట్టింగ్‌ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సెప్టెంబర్‌ 18న పేటీఎం యాప్‌ను గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ నుంచి కొన్ని గంటలపాటు తొలగించింది. సదరు ఫీచర్‌ను తొలగించిన తర్వాతే మళ్లీ ప్లేస్టోర్‌లో చేర్చింది. గూగుల్‌ తన మార్కెట్‌ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పోటీ సంస్థలను అణగదొక్కేందుకే ఇలాంటి పక్షపాత విధానాలు అమలు చేస్తోందని పేటీఎం ఆరోపించింది.

ప్లేస్టోర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యాప్స్‌పై గూగుల్‌కు గుత్తాధిపత్యం ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో గూగుల్‌ తమ విధానాలపై వివరణనిచ్చింది. ప్లే స్టోర్‌ ద్వారా డిజిటల్‌ కంటెంట్‌ విక్రయించే యాప్స్‌ కచ్చితంగా గూగుల్‌ ప్లే బిల్లింగ్‌ సిస్టమ్‌నే ఉపయోగించాలని, ఇన్‌–యాప్‌ కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట శాతం ఫీజుగా చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై డెవలపర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భారత్‌లోని డెవలపర్లు.. ప్లే బిల్లింగ్‌ సిస్టమ్‌తో తమ యాప్‌లను అనుసంధానించేందుకు గడువును 2021 మార్చి 31 దాకా పొడిగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular