fbpx
HomeBusiness812 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

812 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

SENSEX-FALL-BY-812-POINTS

ముంబయి: అమ్మకాలు అమాంతగా వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లకు భారీ షాక్‌ తగిలింది. వెరసి గత ఆరు నెలల్లో ఎప్పుడూలేని విధంగా మార్కెట్లు బోర్లా పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,000 స్థాయిని సైతం కోల్పోయింది. చివరికి 812 పాయింట్లు పడిపోయి 38,034 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 255 పాయింట్లు పతనమై 11,250 వద్ద నిలిచింది.

తొలుత వడివడిగా మొదలైన మార్కెట్లలో మిడ్‌సెషన్‌ నుంచీ ఒక్కసారిగా అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా 38,991 పాయింట్ల గరిష్టం నుంచి సెన్సెక్స్‌ ఒక దశలో 37,946 వరకూ పడిపోయింది. ఇక నిఫ్టీ 11,535- 11,219 పాయింట్ల మధ్య ఆటుపోట్లను ఎదుర్కొంది. దీంతో ఇంట్రాడే కనిష్టాల సమీపంలోనే మార్కెట్లు స్థిరపడటం గమనార్హం! వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో కేంద్రానికి ఎదురవుతున్న సవాళ్లు, చైనాతో సరిహద్దు వివాదాలు, యూరోపియన్‌ దేశాలలో మళ్లీ తలెత్తుతున్న కోవిడ్‌-19 కేసులు తదితర ప్రతికూలతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

దీనికితోడు పలు గ్లోబల్‌ బ్యాంకులలో అవకతవకలు జరిగాయంటూ వెలువడిన ఆరోపణలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు తెలియజేశారు. ఎన్ఎస్‌ఈలో ఐటీ 0.7 శాతం నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ 6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌ మాత్రమే అదికూడా 0.8-0.25 శాతం మధ్య బలపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇతర బ్లూచిప్స్‌లో ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్టెల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, సిప్లా, మారుతీ, యాక్సిస్, గెయిల్‌, నెస్లే, జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, బ్రిటానియా, ఐవోసీ, ఎస్‌బీఐ, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ ఫార్మా 8.6-3.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 205 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 250 కోట్లు, డీఐఐలు రూ. 1,068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular