fbpx
Saturday, April 27, 2024
HomeNationalనూతన విద్యా విధానం వల్ల బహు ప్రయోజనాలు: మోడీ

నూతన విద్యా విధానం వల్ల బహు ప్రయోజనాలు: మోడీ

PM-MODI-AT-SMART-INDIA-HACKATHON

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం వలన భారత పౌరులు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

దేశంలో పాత విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. కొత్త విద్యా విధానంలో విద్యార్థి ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో అదే అందించడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ నూతన విధానం కేవలం ఒక విధాన పత్రం కాదని, 130 కోట్ల మందికిపైగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ‘ఇన్నాళ్ళు తమకు ఇష్టం లేని సబ్జెక్టులను తమపై బలవంతంగా రుద్దుతున్నారని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు.

వారికి ఏ మాత్రం ఆసక్తి లేని చదువులు చదవాలని వారిపై మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండేది. దీనివల్ల విద్యార్థులు అక్షరాస్యులు అవుతారేమో గానీ వారికి ఉపయోగం మాత్రం ఉండదు. డిగ్రీలు సంపాదించినప్పటికీ ఆత్మవిశ్వాసం కొరవడుతుంది.

ఇది వారి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చడమే ఈ నూతన విద్యా విధానం యొక్క ప్రధాన ఉద్దేశం’ అని మోదీ ఉద్ఘాటించారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ నాలుగో ఎడిషన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించింది.

ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. ఈ ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular