దుబాయ్: ఐసీసీ ప్రకటించిన బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారధి రన్ మెషీన్ అయిన విరాట్ కోహ్లి మంచి స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 3 హాఫ్ సెంచరీలతో అదరగొట్టి, తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు.
ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్‌లో పలు సార్లు డకౌట్లతో విఫలమైన కేఎల్ రాహుల్ ఒక ర్యాంకు కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా, ఆఖరి టీ20లో అర్ధశతకంతో చెలరేగిన రోహిత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ 26వ స్థానానికి చేరుకున్నాడు.
కాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రెండవ స్థానంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే, ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏ ఒక్క బౌలర్‌కు కూడా టాప్-10లో చోటు దక్కలేదు.
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 597 రేటింగ్ పాయింట్లతో 14వ స్ధానంలో నిలువగా, రీఎంట్రీలో అదరగొట్టిన టీమిండియా పేసర్ భువనేశ్వర్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపరుచుకొని 24వ స్థానంలో నిలిచాడు. టాప్-10 బౌలర్లలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ అగ్రస్థానానికి ఎగబాకగా, ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి పడిపోయాడు.