fbpx
Monday, April 29, 2024
HomeInternationalజపాన్‌ డిజిటల్‌ కరెన్సీ వైపు మొగ్గు

జపాన్‌ డిజిటల్‌ కరెన్సీ వైపు మొగ్గు

JAPAN-PLANS-DIGITAL-CURRECNY-SOON

టోక్యో: పేపర్‌ కరెన్సీని అత్యధికంగా ఇష్టపడే ప్రపంచ దేశాలలో జపాన్‌ ఒకటి, అయితే ఇప్పుడు అక్కడ డిజిటల్‌ కరెన్సీకి తెర తీయనున్నారు. ప్రభుత్వం ఇందుకు తాజాగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 2021లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ యెన్ జారీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వబోనుంది.

కామన్‌, ప్రయివేట్‌ డిజిటల్‌ కరెన్సీ జారీ చేయడానికి దాదాపు 30కుపైగా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. డిజిటల్‌ యెన్ జారీకి ప్రణాళికలు వేస్తున్నట్లు ఇటీవల జపనీస్‌ కేంద్ర బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్ జపాన్‌(బీవోజే) ప్రకటించిన నేపథ్యంలో పలు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌లో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకునే ఉద్దేశంలో జపనీస్‌ ప్రభుత్వం ఉన్నట్లు ఫారెక్స్‌ విశ్లేషకులు తెలియజేశారు. జపాన్‌లో పలు ఇప్పటికే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నప్పటికీ నగదు లావాదేవీలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని బీవోజే ఎగ్జిక్యూటివ్‌ హీరోమీ యమవోకా తెలిపారు.

జపాన్ లో నగదు చెల్లింపులను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అధిగమించలేవని ఆయన వ్యాఖ్యానించారు. కాగా వివిధ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఒకే తరహా లావాదేవీలకు వీలు కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ కరెన్సీ ప్రయోగాత్మక దిశలో జారీకి ప్రయివేట్‌ బ్యాంకులకు అవకాశమున్నదని, ఇందుకు ఇతర సంస్థలకూ అవకాశం కల్పించే వీలున్నదని వివరించారు.

ప్రపంచంలోనే అత్యల్పంగా జపాన్‌లో నగదు రహిత చెల్లింపుల వాటా 20 శాతంగా నమోదవుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్‌లో ఇవి 45 శాతంకాగా, ఇది చైనాలో మరింత అధికంగా 70 శాతానికి చేరినట్లు వివరించారు.

చైనాతో పోలిస్తే జపాన్‌లో విభిన్న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఒకదానితో మరొకటి పోటీ పడుతుండటంవల్ల నగదురహిత చెల్లింపులు తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లోని మూడు అతిపెద్ద బ్యాంకులు మిత్సుబిషి, మిజుహో ఫైనాన్షియల్‌, సుమితోమో మిత్సుయి తమ సొంత డిజిటల్‌ పేమెంట్‌ విధానాలను అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular