మెల్బోర్న్: ఆస్ట్రేలియా తమ దేశ పౌరుల రాకపై గతంలో నిషేధం విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. మే నెల 15 వరకూ నిషేదం అమల్లో ఉండగా, ఆ రోజు నుంచే భారత్ నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్ట్రే లియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ ఇవాళ ప్రకటించారు. దాదాపు భారత్ నుండి ఆస్ట్రేలియా కు 9 వేల మంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే ఇండియా నుండి ఆస్ట్రేలియాకు వెళ్లే ఇతర కమర్షియల్ విమానాలకు అనుమతి లేనప్పటికీ, ఆస్ట్రేలియానే స్వయంగా ప్రత్యేక విమానాలను పంపి వారి దేశ పౌరులను తీసుకొని వెళ్లబోతున్నట్లు తెలిపింది. కాగా మే నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య మూడు విమానాలు భారత్కు చేరుకొని తిరిగి వెళతాయని అధికారులు తెలిపారు.
వారు పంపే విమానాలు డార్విన్కు చేరుకుంటాయని తెలిపారు. భారత్లో ఇటీవల కరోనా కేసులు చాలా రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశంలో థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవడానికే నిబంధనలు పెట్టామని, కాగా నిబంధనలు కొనసాగించాల్సిన అవసరం కనిపించనందువల్ల ఆంక్షలు ఎత్తేస్తున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యానించారు.