హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేతలపై హైడ్రా (HYDRA) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగానాథ్, అమీన్‌పూర్ తహసీల్దార్‌లను ప్రశ్నించింది. కోర్టు సెలవుల్లో, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేయడంపై కోర్టు నిషేధ ఆదేశాలున్నా, వాటిని ఉల్లంఘించారని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
ప్రశ్నలు వర్షం
విచారణ సందర్భంగా హైకోర్టు, కూల్చివేతలకు సంబంధించిన వివరణ కోరుతూ, “ఆదివారాల్లో మీరు ఎందుకు పని చేయాలి?” అంటూ హైడ్రా అధికారులను నిలదీసింది. కోర్టు తీర్పులను పట్టించుకోకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇళ్లను కూల్చే ముందు యజమానులకు చివరి అవకాశం ఇవ్వడం చేశారా?” అంటూ కోర్టు ప్రశ్నించింది.
అత్యవసర కూల్చివేతలపై ప్రశ్నలు
“అత్యవసరం ఏమిటి? ఖాళీ చేయనంత మాత్రాన వెంటనే కూల్చివేయాలా?” అంటూ కోర్టు ప్రశ్నించింది. చట్టాలను పాటించకుంటే, ఇలాంటివి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయని కోర్టు హెచ్చరించింది. రాజకీయ నాయకులనో, ఉన్నతాధికారులనో సంతోషపరచడం కోసం, అధికారి హోదాలో చట్టాలను పక్కన పెట్టడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.
హైడ్రా పనితీరుపై అసంతృప్తి
మూసీ నది సంబంధించి దాఖలైన పిటిషన్లపై కూడా కోర్టు హైడ్రా చర్యలను ప్రశ్నించింది. ట్రాఫిక్ సమస్యలపై కూడా హైడ్రాకు బాధ్యత ఉందని, కానీ దానిపై దృష్టి పెట్టడం లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
తహసీల్దార్, హైడ్రా కమిషనర్‌పై విమర్శలు
“సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారు. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించిన హైకోర్టు.. అమీన్‌పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్‌ల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై త్వరపడి చర్యలు తీసుకోవడం సరికాదని, ఫ్రీజ్ లేదా సీజ్ చేయవచ్చని సూచించింది. అక్టోబర్ 15కి విచారణను వాయిదా వేస్తూ, అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.