యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీపై కొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొల్పినప్పటికీ, షూటింగ్ అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురవుతున్నారు. తాజాగా, చిత్ర యూనిట్ కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌ను బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. అయితే, నిర్మాత ఆదిత్య చోప్రా కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉండటంతో, కొన్ని పార్ట్స్‌ను రీషూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్. ఈ రీషూట్‌ల కారణంగా ఎన్టీఆర్ షెడ్యూల్‌లో మార్పులు రావచ్చని, తద్వారా దేవర 2 షూటింగ్ ఆలస్యం కావచ్చని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, వార్ 2 విడుదల అనుకున్న విధంగా జరుగుతుందా? లేక వాయిదా వేస్తారా అనే ప్రశ్న కొనసాగుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కరాటే, గన్ ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అయితే, ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఆయన అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్ట్ 14న విడుదల కావాల్సిన వార్ 2 కాస్త ఆలస్యం కావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ యశ్ రాజ్ ఫిలింస్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్ స్థాయిని పెంచే సినిమాగా ఇది నిలవనుండటంతో, విడుదల తేదీపై వచ్చే అప్డేట్‌ను ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.