మూవీడెస్క్: వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా మట్కా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.
1950ల నుంచి 1980ల వరకు జరిగే పీరియాడికల్ నేపథ్యంలో మాఫియా కథతో ఈ సినిమా రూపొందుతోంది.
కాకినాడలో ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మూడు వేరియేషన్స్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఒక సాధారణ వ్యక్తి నుంచి మాఫియా డాన్ గా ఎదిగే కథాంశం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గతంలో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రను వరుణ్ తేజ్ ఈ సినిమాలో చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా కోసం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బలంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ సినిమా ఆడియో రైట్స్ కోసం ప్రముఖ సంస్థ టి-సిరీస్ 3.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకోవడం విశేషం.
వరుణ్ తేజ్ కెరీర్ లో ఇంత భారీ రేటు కలగటం ఇదే మొదటిసారి. సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లో వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ లో సిగార్ పట్టుకొని, రమ్మీ కార్డ్ పై కూర్చొని కనిపిస్తున్నాడు.
ఈ లుక్ అతని ఇమేజ్ ని పూర్తిగా మారుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాకి సంబంధించి సెట్ డిజైన్ కూడా పీరియాడిక్ నేటివిటీని ప్రతిబింబించేలా హైదరాబాద్ లో వేసినట్టు సమాచారం.