అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించనున్నారు. రెండోసారి అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై గట్టిగా స్పందిస్తున్న ట్రంప్, తాజాగా వారిని స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లేలా ప్రోత్సహించే ప్రకటన చేశారు.
ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, “చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నవారు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లాలనుకుంటే, వారికి విమాన టికెట్లు, కొంత నగదు అందిస్తాం” అని చెప్పారు. ఇది పూర్తిగా స్వీయ బహిష్కరణ ప్రోగ్రామ్‌గా నడవనుందని వివరించారు.
ఇప్పటికే వలస నియంత్రణ కోసం ఇమిగ్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. నేరాలకు పాల్పడుతున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్టు పేర్కొన్నారు. అయితే, చట్టపద్ధతిలో మళ్లీ అమెరికాకు రావాలనుకునే వారికి ఓ అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టి సారించనుందని చెప్పారు.
ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వలస చట్టాలను కఠినంగా అమలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చినా, అదే విధానాన్ని కొనసాగించనున్నారు. దీంతో వలసదారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రకటన అమెరికాలోని పలు వలస వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వచ్ఛంద బహిష్కరణకు నగదు ప్రోత్సాహం ఇవ్వడం శ్రేయస్కరమా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.