ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భూగర్భ మెట్రో ప్రయాణానికి శనివారం ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ముంబై మెట్రో లైన్-3తో పాటు నగరంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ ఈ ప్రయాణ సమయంలో లాడ్లీ బహిన్ లబ్ధిదారులు, విద్యార్థులు, కార్మికులతో సంభాషిస్తూ, భవిష్యత్ మెట్రో ప్రయాణంపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఈ కొత్త మెట్రో ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు రూపొందించిన “మెట్రో కనెక్ట్-3” మొబైల్ యాప్‌ను కూడా ప్రధాని శనివారం ప్రారంభించనున్నారు.
ఎంఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భిడే మాట్లాడుతూ, “ఈ రోజు ముంబయి ప్రజలకు చారిత్రకంగా నిలుస్తుంది. ఈ భూగర్భ మెట్రో ముంబై నగరపు రూపురేఖలను మార్చడమే కాకుండా, నగర వాసులకు కొత్త ప్రయాణ అనుభూతిని అందించనుంది” అని పేర్కొన్నారు.