fbpx
HomeTelanganaనేడు తెలంగాణ కేబినెట్ భేటి : కీలక నిర్ణయాలు

నేడు తెలంగాణ కేబినెట్ భేటి : కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవ్వనుంది. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోబోతోందని సమాచారం. ముఖ్యాంశాలు:

నూతన సచివాలయం

నూతన సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి పచ్చ జెండా ఊపనున్నారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్‌–పొన్ని జంట రూపొందించిన సచివాలయం డిజైన్‌ను ఇప్పటికే సీఎం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఈ డిజైన్‌కు మెరుగులు దిద్ది తుదిరూపు ఇచ్చేందుకు గత రెండు వారాలుగా సీఎం కేసీఆర్‌ కసరత్తు నిర్వహించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో సచివాలయ తుది డిజైన్‌ను ఆమోదించడంతో పాటు నిర్మాణ పనుల అంచనా వ్యయం, టెండర్ల నిర్వహణకు సంబంధిచిన కార్యక్రమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశముంది. రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో సచివాలయం భవనాన్ని నిర్మించాలని సీఎం యోచిస్తున్నారు.

డిజిటల్ చదువులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో విద్యా సంస్థలను ఇప్పుడే తెరవడం ఏ మాత్రం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్య, డిజిటల్‌ బోధన తరగతులు ప్రారంభించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.

ఆగస్టు 31 వరకు దేశంలో విద్యా సంస్థలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీ–శాట్‌ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేసే అంశంపై కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా నియంత్రణ పై దృష్టి

ఇప్పటి దాకా పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్‌ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామీణంలో కరోనా నియంత్రణ, టెస్టుల నిర్వహణ, భాధితులకు వైద్య సదుపాయాలు కల్పించే అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

పీహెచ్‌సీ స్థాయిలో వైద్యులకు కరోనా చికిత్సపై శిక్షణ ఇవ్వడం, టెస్టులు నిర్వహణకు ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశముంది. వీటితో పాటు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం తీరు తెన్నులు, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలను సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

ఇతర అంశాలు

ఇంకా సమావేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంపు, పీఆర్సీ అమలు, లాక్‌డౌన్‌ కాలంలో కోత పెట్టిన సగం జీతాలను తిరిగి చెల్లించే వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి.

వీటిపై ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూల నిర్ణయాలు రావచ్చని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. కేబినెట్‌ ఎజెండాలో ఈ విషయాలు లేకపోయిన టేబుల్‌ ఎజెండాగా వీటిని కేబినెట్‌ ముందు పెట్టి ఏమైన నిర్ణయాలు తీసుకోవచ్చని సచివాలయ ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చలు, కీలక నిర్ణయాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఏమి జరగనుందొ వేచి చూడాలి.

TELANGANA CABINET MEET TODAY | TELANGANA CABINET MEET TODAY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular