తెలంగాణ: కంచ-గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. బుధవారం జరిగిన విచారణలో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికి వేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అనుమతి లేకుండా చర్యలు తీసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించింది.
1996లో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టత ఇవ్వాలని తెలంగాణ తరఫున ఉన్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులతోనే జామాయిల్ తరహా చెట్లు తొలగించామని సింఘ్వీ సమాధానమిచ్చారు. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వ చర్యలు జరిగాయని పేర్కొన్నారు.
అయితే, అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకువచ్చిన వివరాల్లో రూ.10,000 కోట్లకు భూములను మార్టిగేజ్ చేశారని ఉన్నప్పటికీ, ఈ విషయం తమకు ముఖ్యం కాదని, చెట్ల నరికి వేతపై అనుమతుల విషయమే ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. ఈ వ్యాఖ్యలతో అధికారుల్లో తీవ్ర భయం నెలకొంది.
gachibowli, supreme court, telangana, land dispute, trees-cutting,