పంజాబ్: స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారంలో శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై బుధవారం ఉదయం హత్యాయత్నం జరిగింది.
సిక్కు మత పెద్దల తీర్పు ప్రకారం, ఆయన తలపెట్టిన తప్పుల కారణంగా శిక్ష అనుభవిస్తూ, దేవాలయం ద్వారపాలకుడిగా కూర్చున్నారు. ఈ సమయంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు, వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలతో సిక్కు మత పెద్దలు సుఖ్‌బీర్ సింగ్ సహా అప్పటి మంత్రివర్గంపై శిక్షలు విధించారు.
చేతిలో ఈటె పట్టుకుని, మెడలో చేసిన తప్పు రాసిన పలక ధరిస్తూ, ఆయన వీల్ చైర్‌లో కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. బుధవారం ఉదయం, స్వర్ణ దేవాలయానికి వచ్చిన 50 ఏళ్ల సిక్కు వ్యక్తి సుఖ్‌బీర్ వద్దకు చేరుకొని, మొలలో దాచుకున్న తుపాకీతో కాల్పులు జరిపారు.
అయితే, సుఖ్‌బీర్ అనుచరుడు వెంటనే ఆ దుండగుడిని అడ్డుకోవడంతో తూటాలు గాలిలోకి ఎగిరిపోయాయి. ఈ ఘటనతో దేవాలయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
హత్యాయత్నం జరగడం పట్ల భద్రతా లోపాలపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.