హైదరాబాద్: తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సెలబ్రిటీ ల ప్రోత్సాహం తో విజయవంతంగా కొనసాగుతుంది. సినిమా రంగానికి చెందిన చాలా మంది ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇపుడు శర్వానంద్ కూడా ఇందులో చేరి తన వంతు బాధ్యతగా తన ఇంటి పక్కన ఉన్న పార్క్ ని దత్తత తీసుకున్నాడు. ఈ ఛాలెంజ్ ని తాను స్వచ్చందంగా స్వీకరించి ఎం పి సంతోష్ కుమార్, జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొక్కలు నాటారు.
తమ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కును తాను దత్తత తీసుకొని అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పార్కులో అవసరమైన వాకింగ్ ట్రాక్‌ను, పార్కు అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను తన సొంత డబ్బులతో చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తాను తన ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట అలాగే యూవీ క్రియేషన్స్ ప్రమోద్ కి ఛాలెంజ్ విసిరారు.
ప్రస్తుతం శర్వానంద్ నటించిన శ్రీకారం అనే సినిమా విడుదలకి సిద్ధం గా ఉంది. కరోనా కి ముందు సమ్మర్ రిలీజ్ ప్లాన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇప్పడు అందరి ముందు ఉన్న చిక్కు ప్రశ్న. ఇప్పటికే వరుస ప్లాప్ లో ఉన్న కూడా చేతి నిండా ఆఫర్స్ తో ముందుకువెళ్తున్నాడు ఈ యూత్ స్టార్.