ఉత్తరప్రదేశ్: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక మహోత్సవం 45 రోజుల పాటు సాగి, 66 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగా, యమునా, సరస్వతి సంగమంలో స్నానం ఆచరించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో సాధువులు, మఠాధిపతుల ఆశీర్వాదంతో ఈ మహా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని యోగి పేర్కొన్నారు. భక్తుల అధిక సంఖ్యలో హాజరవడంతో ఈ కుంభమేళా చారిత్రకంగా నిలిచిందని ఆయన అన్నారు.
ఈ వేడుక ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం సమకూరినట్లు సమాచారం. ఈ కుంభమేళా సందర్భంగా దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
వసతి, ఆహారం, రవాణా, పూజ సామగ్రి, హస్తకళలు వంటి రంగాలు భారీ లాభాలు సాధించాయి. ప్రయాగ్‌రాజ్ మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాల్లోనూ వ్యాపారం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభమేళా ఏర్పాట్ల కోసం రూ.7,500 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించింది.