న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నుండి దీపావళికి విడుల కానున్న ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ కోసం దేశ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై రిలయన్స్ మరో కొత్త సూపర్ అప్ డేట్ వచ్చింది.
ఈ తాజా రిలయన్స్ జియో ఫోన్‌లో భారతీయత ఉట్టిపడేలా ‘ఆపరేటింగ్ సిస్టం’కు భారత సాంప్రదాయమైన పేరు పెట్టి ఆ సంస్థ యొక్క అధినేత అయిన ముఖేష్ అంబానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఫోన్‌లో ఫీచర్లు, ఓఎస్ గురించి జియో అధికారికంగా ప్రకటించింది.
కాగా స్మార్ట్‌ఫోన్ మొబైల్ మార్కెట్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ కి ఎదురే లేదు. తన రైవల్ యాపిల్ ఓఎస్ నుంచి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ గూగుల్‌కి చెందిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానం మాత్రం అసలు చెక్కు చెదరడం లేదు. ఆండ్రాయిడ్‌కి పోటీగా హువావే, శామ్‌సంగ్, వన్‌ప్లస్‌లు కొత్త ఓఎస్‌లు అభివృద్ధి చేసినా ఆండ్రాయిడ్ ముందు నిలవలేకపోయాయి.
ఈ నేపథ్యంలో తొలిసారి జియో ఫోన్ నెక్ట్స్‌లో ఉపయోగించే ఓఎస్‌కు ‘ప్రగతి ఓఎస్’గా కంపెనీ నామకరణం చేశారు. జియో ఫోన్‌ను అందరూ వినియోగించి,ప్రగతి (ప్రొగ్రెస్) సాధించాలని ఉద్దేశంతో ప్రగతి పేరు పెట్టినట్లు జియో తెలిపింది.