తిరుపతి: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన “సనాతన ధర్మం వైరస్ లాంటిది” అనే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు.
పవన్ కల్యాణ్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, “ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దేశం అశాంతికి గురయ్యేది” అన్నారు. “హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా?” అని ప్రశ్నించారు.
సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందని, దానిని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. “సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకోవడం కొండను ఉలి దెబ్బతో కూల్చేయాలనుకోవడమే” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అంతేకాక, రాహుల్ గాంధీ రామజన్మభూమి ప్రతిష్ట కార్యక్రమంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. “హిందువులపై ఇలాంటి దాడులు, అవమానాలు జరిగితే మౌనంగా ఉండటమేనా?” అని ప్రశ్నిస్తూ, హిందూ ధర్మానికి గౌరవం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.