అమరావతి: బెజవాడపై వరుణుడు కళ్లెర్ర చేశాడు. వరదలు బీభత్సాన్ని సృష్టించి అనేకమంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ, చాలా మంది బాధితులు ఇంకా ఆహారానికి తహతహలాడుతున్నారు.
వరద పరిస్థితి కొంత తగ్గినట్లు కనిపిస్తోన్న వేళ, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలను జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశంతో, మరొకసారి వర్షాల కురుస్తాయని అంచనా వేసింది.
దీంతో, యంత్రాంగం అప్రమత్తమై ఉంది. విజయవాడలో ఇప్పటికే వర్షం కురుస్తుండటంతో, స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
మరోసారి వర్షం – విజయవాడ ప్రజల్లో భయాందోళన
విజయవాడలో వరదల వల్ల జరిగిన ప్రాణనష్టాలు, ఆస్తి నష్టాలు ప్రజలలో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి.
బుడమేరు ముంపుతో విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు నుంచి కోలుకునే లోపే, మరోసారి గుంటూరు, విజయవాడ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
రాత్రి 2:30 గంటల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో, సహాయక చర్యలు మరింత కష్టతరమవుతున్నాయి.
నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది. అయితే, విజయవాడలో వరద నీరు కొంతమేర తగ్గినా ప్రజలు ఇంకా భయంతోనే ఉన్నారు.
తాజా హెచ్చరికలు – ప్రజల్లో ఆందోళన
తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఎటుచూసినా వరద నీరు, బురదే కనిపిస్తుండటంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో, ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద తగ్గినా హైఅలర్ట్
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో, ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం కొంతమేర తగ్గడంతో, ప్రభుత్వం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంది.
బ్యారేజి వద్ద ఈ రోజు ఉదయం వరద ప్రవాహం 5 లక్షల 25 వేల క్యూసెక్కులకు తగ్గింది. 30 గంటలలో ఆరు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం తగ్గడంతో, బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలు క్రమంగా జల దిగ్బంధనంనుంచి బయటపడుతున్నాయి.