అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు పరిశీలిస్తే, ఎన్డీఏ ప్రభుత్వం విద్యా రంగం, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి వంటి విభిన్న రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని భావించవచ్చు. అయితే, ఇంకా ఇవన్నీ కార్యరూపం దాల్చవలసి వుంది.
అమరావతి రాజధాని నిర్మాణం
రాజధాని నిర్మాణం రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాల్లో ఒకటి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించడం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కేంద్రం నిధుల సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయడం ముఖ్యమైన అంశం. ఈ నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి పునాది సిద్దమవుతుంది, అనేక వర్గాలకు ఉపాధి దొరుకుతుంది.
పోలవరం ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మరియు దాని రైతులకు జీవనాడిగా ఉంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి, సమర్ధవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన మార్గనిర్దేశం చేయడానికి అంతర్జాతీయ నిపుణులను రప్పించడం జరిగింది. పనులు పునః ప్రారంభమయ్యాయి. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు దాని రైతులకు నీటి పారుదల కోసం కీలకంగా ఉంటుంది.
కనెక్టివిటీ
ఎన్డీఏ ప్రభుత్వం రైలు, ఆకాశ, రోడ్డు మార్గాల కనెక్టివిటీ మెరుగు పరచటంపై దృష్టి సారించింది. తద్వారా పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, ధరల నియంత్రణ సాధించటానికి ఊతమిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రోడ్లు మరియు నీటి సరఫరా
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంకా మెరుగుపరచవలసి ఉంది. నీటి సరఫరా మరియు ఇతర మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడం అవసరం. రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామాలలో రోడ్ల దుస్థితి మరీ అద్వానంగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా దృష్టిసారించాలి.
విద్యారంగంలో మౌలిక సదుపాయాలు మరియు ఉపాధ్యాయుల కొరత:
విద్యా రంగంలో మెరుగుదలకు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కీలకంగా మారబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో ఇంకా మౌలిక సదుపాయాల మరియు ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు ఉన్నాయి. ఈ అంశాలు విద్యా రంగంలో మరింత సమగ్ర సవరణలు అవసరం ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి.
ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడం ద్వారా పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్నయయించడం ముదావహం. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు ఉపాధ్యాయులను అందించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుంటూనే లోపరహిత విధానాన్ని అనుసరించడం అవసరం.
పెన్షన్లు పెంచడం
వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పెన్షన్లను గణనీయంగా పెంచడం ద్వారా వారి ఆర్థిక భరోసాను మెరుగుపరచడం జరిగింది. పెన్షన్ల విషయంలో పారదర్శకత, అసలైన లబ్ధిదారులను గుర్తించడం అత్యవసరం.
అన్న క్యాంటీన్లు
పేదవారి కోసం తక్కువ ధరలో భోజనం అందించడానికి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడం ఒక మంచి విషయం.
నిరుద్యోగం మరియు పేదరికం
నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, ఈ సమస్యలను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ఇచ్చిన హామీలను అమలుపర్చడం కత్తిమీద సామేనని ఒప్పుకోక తప్పదు. ఈ దిశగా క్రొత్త ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం అభినందనీయం. సామాజిక భద్రత మరియు ఆర్థిక రంగాల్లో ప్రజలకు మరింత సహాయం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
పెట్టుబడులు
బీపీసీఎల్ వంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టమవుతోంది. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం మరింత అవసరం.
పారిశ్రామిక సంస్కరణలు
పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి పెద్ద పీట వేస్తూ తదనుగుణంగా పారిశ్రామిక విధానాలూ, సంస్కరణలూ తీసుకురావాలి. మౌలిక సదుపాయాల కల్పనా, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి మొదలు పెట్టినప్పటికీ, పరిష్కరించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి.
రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి, శాంతియుత వాతావరణాన్ని పరిస్థితులని కల్పించినప్పుడే పెట్టుబడులను ఆకర్షిస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందవచ్చునన్న సత్యాన్ని గ్రహించటం అత్యంత కీలకం.